ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి పిల్లల ఆధార్ కార్డు అప్ డేట్ కోసం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మరో విడత ప్రత్యేక శిబిరాలను నిర్వహించబోతోంది.
ఈ ఆధార్ క్యాంపులు ఈ నెల 5వ తేదీన ఆరంభం కానున్నాయి. 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. నవంబర్, డిసెంబర్ లల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు జరిగాయి. అయినప్పటికీ- ఆధార్ కార్డు వివరాలను అప్ డేట్ చేసుకోని పిల్లల సంఖ్య లక్షల్లో ఉంటోంది. మొత్తం 16.51 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. ఇప్పటివరకు 5.94 లక్షలు పూర్తయ్యాయి. ఇంకా 10.57 లక్షలు పెండింగ్ లో ఉన్నాయి. వారి ఆధార్ కార్డులు అప్‌డేట్ కాలేదు.
దీంతో మరో విడత తమ పిల్లల ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవడానికి తల్లిదండ్రులకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. వారందరూ కూడా తమ ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కార్డు ఇన్ యాక్టివ్ అవుతుంది. 5 నుంచి 17 సంవత్సరాల లోపు పిల్లలు తమ బయోమెట్రిక్, ఇతర వివరాలను ఈ క్యాంపుల ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. 15 నుంచి 17 ఏళ్ల జూనియర్ కాలేజ్ విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాలి. బయోమెట్రిక్ అప్ డేట్ లేకపోతే నీట్, జేఈఈ వంటి పరీక్షలకు అనుమతి లభించకపోవచ్చు. విద్యార్థులు తమ సమీప పాఠశాల / జూనియర్ కాలేజీలో జరిగే ఆధార్ స్పెషల్ క్యాంప్‌కు హాజరుకావాలి. పాఠశాలలు, కాలేజీ సిబ్బంది ఈ విషయంపై విద్యార్థులను అవగాహన కల్పించాలి. వారికి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఈ క్యాంపుల సమయంలో నియమిత సిబ్బందిని ఇతర పనులకు నియమించకూడదు.