కాకినాడ : ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటికి తక్షణమే పరిష్కారం చూపడంతో పాటు భవిష్యత్తులో పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. నగరంలోని 2వ డివిజన్ పరిధిలోని బొందగుంట ప్రాంతంలో అధికారులతో కలిసి ఆయన  పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు.
ఈ సందర్భంగా తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను కమిషనర్ పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
డివిజన్ పరిధిలోని డ్రైనేజీ కాలువల్లో పూడికతీత, సిల్ట్ తొలగింపు పనులను నిరంతరం చేపట్టాలని శానిటేషన్ విభాగం సిబ్బందిని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మెరుగైన పారిశుధ్య వాతావరణాన్ని ప్రజలకు అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కారం చూపాలని, ఒకసారి పరిష్కరించిన సమస్య మళ్లీ తలెత్తకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో డివిజన్ నాయకులు, మాజీ డిప్యూటీ మేయర్ సత్తిబాబు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృద్వి చరణ్, డీఈలు లక్ష్మీ, ఫణీంద్ర, లక్ష్మీనారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About The Author