కాకినాడ : పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించి, తమ వంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక మొక్కను నాటి పెంచడంతో పాటు, నగరంలోని ఖాళీ ప్రదేశాలు, రహదారి డివైడర్లు, ప్రభుత్వ స్థలాల్లో విస్తృతంగా మొక్కలు నాటితే కాకినాడను పచ్చని, ఆహ్లాదకరమైన నగరంగా తీర్చిదిద్దవచ్చన్నారు.
కాకినాడ నగరంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా బుధవారం పాత ఎస్పీ కార్యం నుండి నార్మల్ తో జంక్షన్ వరకు రహదారి డివైడర్‌లో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. దాతలు నరేష్ వైట్ల వీరమని దంపతులు అందించిన మొక్కలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తితో తమ సొంత ఖర్చుతో మొక్కలను అందించి, వాటి పెంపకానికి ముందుకు వచ్చిన దంపతులను కమిషనర్ అభినందించారు.ప్రజలు తమ ఇళ్లలో చిన్న ఖాళీ స్థలం ఉన్నా మట్టిని ఇబ్బందిగా భావించి సిమెంట్‌తో చప్టాలు వేసుకుంటున్నారని అన్నారు. అయితే మన నగరం చల్లగా, ఆహ్లాదకరంగా ఉండాలంటే మట్టి, మొక్కలు, చెట్లు ఎంతో అవసరమని పేర్కొన్నారు. మన ఇళ్ల వద్ద మాత్రమే కాకుండా వీధులు, రహదారులు, డివైడర్లు, బహిరంగ ప్రదేశాల్లో కూడా పచ్చదనాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.
మొక్కలు అందించిన దాత నరేష్ వైట్ల వీరమని దంపతులు మాట్లాడుతూ.. కాకినాడ తమ సొంత నగరమని, నగర అభివృద్ధికి తమ వంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. .ప్రజల భాగస్వామ్యంతో ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించేందుకు ఆసక్తి ఉందన్నారు. అందరూ కలిసి ముందుకు వస్తే కాకినాడను మరింత పచ్చగా, పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు. “గ్రీన్ కాకినాడ.. క్లీన్ కాకినాడ” లక్ష్యంతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సామాజికవేత్త, కార్పొరేషన్ గ్రీన్ అంబాసిడర్ వేణు మాట్లాడుతూ.. కాకినాడ పచ్చదనం పెంపులో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని కాపాడటం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. హార్టికల్చర్ సిబ్బంది మొక్కలకు అవసరమైన నీటిని అందించేలా చర్యలు తీసుకుంటారని, ప్రజలు మాత్రం మొక్కలను తొలగించకుండా, ధ్వంసం చేయకుండా సంరక్షించాలని కోరారు.
ఎంతో శ్రమతో నాటుతున్న మొక్కలు పెరిగి పెద్ద చెట్లుగా మారితే కాకినాడలో పచ్చదనం పెరగడంతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గి చల్లదనం, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. పశువులను రోడ్లపైకి వదిలేయకుండా వాటి యజమానులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
కాకినాడను మరింత పచ్చగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, నగరపాలక సంస్థతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, పారిశ్రామిక సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని వేణు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కే.టి. సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృద్వి చరణ్, హార్టికల్చర్ ఏడి శ్రీనివాసరావు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

About The Author