గుంటూరు నగరంలో బక్రీద్ పండుగని సహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని, దానికి ప్రజలందరూ సహకరించాలని గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్ అన్నారు. ఈ నెల మే 28, 2026 బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజలు పాటించాల్సిన అంశాలను కమిషనర్ మంగళవారం వివరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గోవధ మరియు గోవులను, దూడలను అక్రమ రవాణా చేయుట నిషేధించామని, ఎవరైనా జంతు సంక్షేమ చట్టాలను అతిక్రమించి గోవధ మరియు అక్రమ రవాణాచేసినట్లయితే జైలు శిక్ష మరియు జరిమానా లేదా రెండు విధించబడతాయన్నారు. బాధ్యతగల పౌరులు ప్రతి ఒక్కరూ జంతు సంక్షేమం మరియు వాటి చట్టాలు గౌరవిస్తూ వాటికి హాని కలిగించకుండా, మత సామరస్యాన్ని కాపాడుతూ సుహృద్భావ వాతావరణంలో శాంతియుతంగా ఈ పవిత్రమైన పండుగను జరుపుకోవాలని కోరుతున్నామన్నారు. పండుగ సందర్భంగా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తో నిఘ (సర్వైవలెన్స్) కమిటీని ఏర్పాటు చేసి అనగా పోలీస్, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, రవాణా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మరియు గుంటూరు నగర పాలక సంస్థ వారు ఐదు ఎన్ఫోర్స్మెంట్ టీములు ఏర్పాటు చేసి నగరంలో గోవధ నిషేధము మరియు జంతు సంక్షేమ చట్టాలపై ప్రజలకు నిరంతరము పాంప్లెట్స్, బ్యానర్ల మరియు మైకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ టీములు నగర ప్రజల సహకారంతో నిరంతరము పశు వధ కేంద్రాలను తనిఖీ చేసి ఎక్కడైనా అక్రమంగా రవాణా చేసిన పశువులు ఉంటే వాటిని నగర పాలక సంస్థ వారి ప్రత్యేక వాహనం ద్వారా పట్టుకొని వాటిని గో సంరక్షణశాలకు తరలిస్తారన్నారు. నగర పాలక సంస్థ అనుమతించిన ప్రదేశాలలో అనగా ఆంధ్ర ముస్లిం కాలేజ్ సమీపంలోని రావుఫ్ నగర్ ప్రాంతంలో మరియు బి కన్వెన్షన్ సెంటర్ ఎదురు అన్ని సదుపాయాలతో తాత్కాలిక వధ శాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పండుగ చేసుకునే ప్రజలు ఈ తాత్కాలిక వధ శాలలను వినియోగించుకోవాలని కోరుతున్నామన్నారు. ప్రజలు ఇక్కడ కాకుండా నగరంలో ఎక్కడైనా పశువుల వధ చేసినట్లయితే శిక్షించుట జరుగుతుదని తెలియచేశారు. అలాగే సదరు వధ శాలల వద్ద నగర పాలక సంస్థ పారిశుధ్య కార్మికులు నిరంతరము పారిశుద్ధ్య నిర్వహణ చేసి జంతు వ్యర్ధాలను తొలగించి, సాంకేతిక పద్ధతుల్లో వాటిని పూడ్చి పెడతారని తెలిపారు. కావున ప్రజలు నగర పాలక సంస్థకు సహకరించాలని కోరారు.

About The Author