కాకినాడ : కాకినాడ నగరంలో గృహ గణన కార్యక్రమం సజావుగా కొనసాగుతోందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం నగరంలోని 30వ డివిజన్ రాజాధి వీధిలో నిర్వహిస్తున్న గృహ గణన ప్రక్రియను సెంట్రల్ సెన్సెస్ జాయింట్ డైరెక్టర్ చంద్రకళతో కలిసి ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబాల వివరాలు నమోదు చేస్తున్న సెన్సెస్ సిబ్బంది పనితీరును పరిశీలించి వారికి అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందించారు.

ఈ సందర్భంగా కమిషనర్ ఎన్‌వీ సత్యనారాయణ మాట్లాడుతూ, నగర పరిధిలో గృహ గణన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కచ్చితత్వంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు, విద్య, ఉపాధి, నివాస పరిస్థితులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని చెప్పారు. ఈ గణాంకాలు భవిష్యత్ ప్రభుత్వ ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

సెంట్రల్ సెన్సెస్ జాయింట్ డైరెక్టర్ చంద్రకళ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎలాంటి పొరపాట్లు లేకుండా గణన ప్రక్రియ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రతి ఇంటి వివరాలు ఖచ్చితంగా నమోదు చేయడం అత్యంత ముఖ్యమని చెప్పారు. ప్రజలు సరైన సమాచారం అందించడం ద్వారా గృహ గణన విజయవంతం అవుతుందని ఆమె తెలిపారు.

అలాగే ప్రజల్లో ఎలాంటి అపోహలు అవసరం లేదని, అధికారిక గుర్తింపు కార్డులతో వచ్చే సెన్సెస్ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. గృహ గణన ద్వారా సేకరించే సమాచారం పూర్తిగా ప్రభుత్వ అవసరాల కోసమే వినియోగించబడుతుందని, ప్రజలు నిర్భయంగా వివరాలు ఇవ్వాలని కోరారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, ఎన్యూమరేటర్లు, సెన్సెస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author