గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న 57 ఎన్నికల వార్డులను 76 వార్డులుగా పెంపుదల చేసిన పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను  ప్రచురించామని, అందులో ఏమైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే ప్రతి రోజు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని సిటి ప్లానర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏసిపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కౌంటర్ లో వ్రాత పూర్వకంగా లేదా Cp.gunturcorporation@gmail.com మెయిల్ కి ఆన్ లైన్ ద్వారా కూడా అందించవచ్చని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డుల సరిహద్దులతో కూడిన ప్రతిపాదిత ముసాయిదాను అధికారికంగా ప్రచురించి, నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించినున్నట్లు, గుంటూరు నగరపాలక సంస్థ వెబ్ సైట్ https://gmc.ap.gov.in లో కూడ అప్ లోడ్ చేశామని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 7,43,354ని 76 వార్డ్ లకు డివైడ్ చేయగా సరాసరి 9,780 వచ్చిందని, అందుకు 10 శాతం హెచ్చు, తగ్గులతో సహజసిద్దమైన బౌండరీలు వచ్చేలా శాస్త్రీయ పద్దతిలో వార్డ్ ల విభజన చేసి ముసాయిదాను రూపొందించినట్లు పేర్కొన్నారు. ముసాయిదాపై ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఏవైనా ఉంటే ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు నగరపాలక కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగానికి వ్రాతపూర్వకంగా సమర్పించాలని కోరారు.

About The Author