భీమవరంలో జిల్లా పురపాలక సంఘ కమిషనర్లతో RDMA సమీక్ష
భీమవరం, june-6 : పశ్చిమగోదావరి జిల్లాలోని పురపాలక సంఘాల కమిషనర్లతో పట్టణంలో ఈ శాఖ ప్రాంతీయ సంచాలకులు(RDMA) సిహెచ్. నాగ నరసింహ రావు శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో మున్సిపాలిటీల పనితీరు, ప్రజా సేవల అమలు, ఆదాయ వృద్ధి, పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా సమీక్ష చేశారు. ముఖ్యంగా ఆస్తి , నీటి పన్ను తదితర పన్నుల వసూళ్లలో సాధించిన పురోగతి, మిగిలి ఉన్న బకాయిల వసూళ్లకు చేపట్టవలసిన ప్రత్యేక చర్యలపై దిశానిర్దేశం చేశారు.
అదేవిధంగా, పౌరులకు అందిస్తున్న మున్సిపల్ సేవలను నిర్ణీత కాలపరిమితి (SLA)లో అందించడంపై, SLA దాటిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ-ఆఫీస్ (e-Office) వ్యవస్థలో పెండింగ్లో ఉన్న ఫైళ్లను సకాలంలో పరిష్కరించి, కార్యాలయ పనితీరులో పారదర్శకత, వేగాన్ని పెంపొందించాలని ఆదేశించారు.
ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి పురమిత్ర యాప్, “మీ కోసం” ప్రజా ఫిర్యాదుల వ్యవస్థల ద్వారా అందిన వినతులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి, పెండింగ్ ఫిర్యాదులను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిష్కరించాల్సిన అవసరాన్ని వివరించారు.
అలాగే “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో భాగంగా పట్టణ పారిశుధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, బల్క్ వేస్ట్ జనరేటర్ల (Bulk Waste Generators) గుర్తింపు, వారి వద్ద తడి-పొడి చెత్త వేరు చేయడం, మూలం వద్దనే వ్యర్థాల నిర్వహణ చర్యలు, కంపోస్టింగ్ యూనిట్ల ఏర్పాటు నిబంధనల అమలుపై సమీక్ష చేపట్టారు. బల్క్ వేస్ట్ జనరేటర్లు తప్పనిసరిగా తమ వ్యర్థాలను స్వయంగా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, ఈ అంశంలో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.