కాకినాడ : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక సదవకాశాన్ని వినియోగించుకునేందుకు మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ కే. శ్రీనివాస్ తెలిపారు. 2026 మార్చి 31 వరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీ సదవకాశాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించగా, ఆ గడువులోగా ఏకమొత్తంగా చెల్లించాల్సి ఉంటుందని సూచించారు.
నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో కలిసి పన్ను బకాయిల వసూళ్లపై డిప్యూటీ కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి మరియు ఖాళీ స్థలాల పన్నులను ఏప్రిల్ 30లోగా చెల్లించిన వారికి 5 శాతం రిబేట్ లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ రెండు అవకాశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్న సదవకాశాలపై అవగాహన కల్పించి, పన్ను చెల్లింపును ప్రోత్సహించాలని సూచించారు.
పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం నగరపాలక సంస్థలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి, అవసరమైన సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. గడువు ముగిసేలోపు బకాయిలు చెల్లించి వడ్డీ మాఫీ, రిబేట్ ప్రయోజనాలను పొందాలని డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.