కాకినాడలో రోడ్ల విస్తరణ, కనెక్టివిటీ రోడ్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం: ఎమ్మెల్యే వనమాడి కొండబాబు

కాకినాడ : కాకినాడ నగరంలోని ప్రతి డివిజన్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చుతున్నామని పేర్కొన్నారు.
కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో శనివారం నగర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ, కనెక్టివిటీ రోడ్ల ఏర్పాటు, పార్కుల అభివృద్ధిపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే అనేక రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పనులు మధ్యలో నిలిచిపోయాయని తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రధాన రహదారులకు అనుసంధానించే కనెక్టివిటీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే పలు ప్రాంతాల్లో ఇప్పటికీ కచ్చా రోడ్లు ఉన్నాయని, వాటిని గుర్తించి పక్కా రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా నగరంలోని పార్కుల అభివృద్ధిపైనా సమావేశంలో సమీక్షించారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా పార్కులను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచించారు. ప్రతి డివిజన్‌లోని సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అధికారులతో సమన్వయంతో కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ, అదనపు కమిషనర్ కె.టి. సుధాకర్, ఈఈలు మాచిరాజు, కనకారావు, డీసీపీ కృష్ణారావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృద్వి చరణ్, కార్పొరేషన్ సెక్రటరీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

About The Author