భీమవరం: పట్టణాన్ని మరింత సుందరీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని భీమవరం శాసనసభ్యులు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ పులపర్తి రామాంజనేయులు తెలిపారు. కోర్ట్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఎడ్వర్ట్ ట్యాంక్ పార్క్‌ను సుమారు రూ.50 లక్షల వ్యయంతో రోటరీ క్లబ్ సహకారంతో అభివృద్ధి చేసిన పార్కును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దాతల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదని చెప్పారు. ఎన్నారై సంజయ్ జూపూడి సహకారంతో ఈ పార్క్ సుందరీకరణ పనులు విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పార్కులో వాకింగ్ ట్రాక్, పచ్చదనం, అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం ద్వారా పట్టణ ప్రజలకు విశ్రాంతి, ఆరోగ్యకర జీవనానికి అనుకూల వాతావరణం కల్పించినట్లు చెప్పారు. ప్రజలు ఉదయం వేళల్లో వాకింగ్, యోగా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆరోగ్యవంతమైన జీవనం గడపాలని ఆకాంక్షించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నగరంలో అభివృద్ధి చేయవలసిన 11 పార్కులను గుర్తించి వాటి సుందరీకరణకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఎడ్వర్ట్ ట్యాంక్ పార్క్‌ను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు మరుగుదొడ్లు, త్రాగునీరు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పట్టణ ప్రజలు ఈ పార్క్‌ను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకరమైన కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో భీమవరం రెవెన్యూ డివిజన్ అధికారి కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, పార్క్ సుందరీకరణ దాత ఎన్నారై జూపూడి సంజయ్, జూపూడి శాంతి విశ్వనాథం, మున్సిపల్ అదనపు కమిషనర్ ఎ.రాంబాబు, మున్సిపల్ ఇంజినీర్ తాతారావు, భీమవరం రోటరీ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

About The Author