గుంటూరు, ఏప్రిల్ 26 : ప్రజలు స్వీయ గణనలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్  కె.మయూర్ అశోక్ కోరారు.
జనాభా గణనపై ప్రజల్లో అవగాహనలో
భాగంగా ఆదివారం “సెన్సస్ 5 కె రన్” ను జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి కమిషనర్ ప్రారంభించారు. “సెన్సస్ 5 కె రన్” హిందూ కాలేజీ కూడలి వరకు జరిగింది. స్వీయ గణన నినాదాలతో రన్
పెద్ద ఎత్తున సాగింది. స్వీయ గణన సదుపాయంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యమై వాస్తవ వివరాలు పొందుపరచుటకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు స్వీయ గణన అందుబాటులో ఉంటుందన్నారు. స్వీయ గణన ద్వారా సమర్పించిన వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు
ధృవీకరిస్తారని స్పష్టం చేశారు. డిజిటల్ విధానంలో స్వీయ గణన చేసుకోవడం వలన మే ఒకటో తేదీ నుండి ఇంటింటికి జరిగే జనాభా లెక్కల సేకరణ సులభతరం అవుతుందని అన్నారు.

జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2027 జనాభా గణన (Census-2027) మొదటిసారిగా డిజిటల్ విధానంలో జరుగుతోందన్నారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ పోర్టల్ (https://se.census.gov.in) ద్వారా ఏప్రిల్ 30వ తేదీ వరకు స్వీయ గణన చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. దేశాభివృద్ధిలో కీలకమైన ఈ జాతీయ కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ భాగస్వాములు కావాలని, డిజిటల్ పద్ధతిలో తమ వివరాలను నమోదు చేసుకుని జనగణనను విజయవంతం చేయాలనీ విజ్ఞప్తి చేశారు. స్వీయ గణన ద్వారా వాస్తవ జనాభా గణన వస్తుందని, మే ఒకటో తేదీ నుండి మే నెలాఖరు వరకు జరిగే గణన వేగవంతంగా జరుగుతుందని అన్నారు. స్వీయ గణన ద్వారా సమర్పించిన వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు
ధృవీకరిస్టారని స్పష్టం చేశారు. వలస వెళ్లిన వ్యక్తులు తమ శాశ్వత చిరునామా వద్దగాని ప్రస్తుతం ఉన్న చిరునామ వద్ద గాని జన గణన చేసుకోవచ్చని సూచించారు. జన గణన పట్ల ఎటువంటి అపోహలు అవసరం లేదని చెప్పారు. పీరియాడికల్ గా జరిగే ఒక కార్యక్రమాన్ని తద్వారా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొనుటకు ఉపయోగపడుతుందని చెప్పారు. జన గణనలో ఓటీపీ కేవలం లాగిన్ కొరకు మాత్రమే అడగడం జరుగుతుందని బ్యాంకు గాని ఇతర సంబంధిత వివరాలు ఇందులో అడగడం జరగదని దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఈ “సెన్సస్ 5 కె రన్” లో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి సి.హెచ్. కృష్ణ, పర్యాటక అధికారి రమ్య, జనాభా గణన ఇన్ ఛార్జ్ అధికారి ఆదిత్య లక్ష్మీ, కలెక్టర్ కార్యాలయ విభాగం పర్యవేక్షకులు మల్లీశ్వరి, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎడ్ల భాస్కర్ రావు, వివిధ శాఖల అధికారులు, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About The Author