గుంటూరు:ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు 10 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. సోమవారం పోలిశెట్టి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 65 అసెస్మెంట్ లకు సంబందించి రూ.95 లక్షలు, బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 9 అసెస్మెంట్ లకు సంబందించి రూ.37 లక్షలు, ఐటీసి లిమిటెడ్ 10 అసెస్మెంట్ లకు సంబందించి రూ.80 లక్షల చెక్ లని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో కమిషనర్ కి పోలిశెట్టి గ్రూప్ హెచ్ఆర్ మేనేజర్ ఎం.రాఘవేంద్రరావు, ఐటీసి అకౌంట్స్ ఆఫీసర్ అప్పలరాజులు అందించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముందస్తు పన్ను సంస్థల యాజమాన్యాలను అభినందిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును ముందస్తుగా ఏక మొత్తంగా చెల్లించే వారికి 5 శాతం రాయితీ అవకాశాన్ని కల్పించిందని, ఈ నెల 30లోపు ఆస్తి పన్నుని ఏక మొత్తంగా చెల్లిస్తే పన్ను రాయితీ లభిస్తుందని తెలిపారు. ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్నుబకాయిలను ఒకేసారి ఏక మొత్తంగా చెల్లిస్తే వారికి వడ్డీపై 50 శాతం రాయితీని కూడా ఈ నెలాఖరులోపు చెల్లించి పొందవచ్చని తెలిపారు. నగరంలోని ఆస్తి, ఖాళీ స్థలపన్నుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొని ఈ నెలాఖరు లోపు ఆస్తి పన్ను చెల్లించి రాయితీ పొందాలని కోరారు. పన్ను చెల్లింపుదారులకు వీలుగా పన్ను సేకరణ క్యాష్ కౌంటర్లు సెలవు రోజులతో సహా ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ జి.సాంబశివరావు, ఆర్ఓ మదన్ గోపాల్ తదితరు పాల్గొన్నారు.