కాకినాడ: నగరంలో డ్రైనేజీలను అక్రమంగా ఆక్రమించి కారు పార్కింగ్ షెడ్లు ఏర్పాటు చేయడం, గ్రీనరీ పేరుతో కాలువలపై ఫెన్సింగ్ వేసి పూల కుండిలను ఉంచడం వంటి చర్యలు చాలా తీవ్రమని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇటువంటి ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, వెంటనే తొలగించే చర్యలు చేపడతామని తెలిపారు.
సోమవారం ఆయన కాకినాడ నగరంలోని 14వ శానిటేషన్ సర్కిల్‌లోని 47వ డివిజన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్, చెత్తను డోర్-టు-డోర్ సేకరణకు ఉపయోగించే పుష్‌కార్ట్స్‌ను మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు.
అనంతరం డివిజన్‌లో పర్యటించిన కమిషనర్, కొంతమంది గృహ యజమానులు డ్రైనేజీలను ఆక్రమించి కారు షెడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఇటుకలు, ఇతర నిర్మాణ సామగ్రిని కూడా కాలువల పై ఉంచిన విషయాన్ని గుర్తించారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డ్రైనేజీలు సరిగా శుభ్రం చేయడంలో ఇలాంటి చర్యలు ఎలా ఆటంకం కలిగిస్తాయో ప్రశ్నించారు. వెంటనే ఈ ఆక్రమణలను తొలగించాలని గృహ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇంతకుముందు సుబ్బయ్య హోటల్ ప్రాంతంలో పర్యటించిన కమిషనర్, అక్కడి వైన్ షాప్ ఎదుట తాగిన గ్లాసులు, ప్లాస్టిక్ వ్యర్థాలు లను గమనించిన కమిషనర్ వెంటనే వైన్ షాప్ నిర్వహకులను పిలిపించి తీవ్రంగా మందలిస్తూ, ఆ పరిసరాలను తక్షణమే శుభ్రం చేయాలని ఆదేశించారు.
ఈ తనిఖీలలో కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్లు నాయుడు, రాంబాబు సచివాలయ సిబ్బంది తదితరులు తదితరులు పాల్గొన్నారు.