కాకినాడ : కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా, అందంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ పేర్కొన్నారు. నగరంలో ఎక్కడపడితే అక్కడ వాల్ పోస్టర్లు అంటించడం వల్ల నగర సౌందర్యం దెబ్బతింటుందని, అలాంటి చర్యలు సహించబోమని ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం కాకినాడ సిటీలోని గుడారగుంట, మూడుగుళ్ల సెంటర్, ఆర్టీవో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను కమిషనర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారుల ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించే పనులు పరిశించారు. అలాగే డివిజన్‌లో ఉన్న పలు సమస్యలను స్థానిక నాయకులు ఆయన దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వ్యాపార సంస్థలు నగరంలో ఎక్కడ పడితే అక్కడ వాల్ పోస్టర్లు అంటించడం మానుకోవాలని, ఇందుకు కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే ప్రకటనలు పెట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ పృథ్వీ చరణ్, మున్సిపల్ ఎలక్ట్రికల్ విభాగం అధికారులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author