నరసాపురం: పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
పట్టణంలో నెలకొన్న చెత్త నిర్వహణ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించామని, త్వరలోనే స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. పట్టణంలో మంగళవారం రుస్తుంబాద శివారు మండవారి గరువు ప్రాంతంలో ప్రభుత్వ భూములను మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి తో కలిసి ఆమె పరిశీలించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు అధికారులు వివరాలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పట్టణ పారిశుద్ధ్య సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని గుర్తించి, నిర్దేశిత విధానాల ప్రకారం పనులు వేగవంతం చేయాలని సూచించారు. మండవారి గరువులో డంపింగ్ యార్డ్ కోసం ఏర్పాటు చేసిన రహదారిని కూడా పరిశీలించారు. అనంతరం పట్టణంలోని టైలర్ హై స్కూల్ , వలందర రేవు సమీప ప్రాంతాల్లో వీధుల్లో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. ఇంటి చెత్తను రోడ్లపై పడేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే వీధుల్లోని చెత్తను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి రోజూ డోర్ టు డోర్ చెత్త సేకరణను కచ్చితంగా అమలు చేయాలని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే ఏటిగట్టు డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని కూడా పరిశీలించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తగిన స్థలాల పరిశీలన పూర్తవుతోందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, టిపిఓ వెంకటరమణ, మండల సర్వే అధికారి ధనరాజు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

About The Author