కాకినాడ: జనాభా గణనలో భాగంగా ప్రజలకు తమ వివరాలను తామే నమోదు చేసుకునే ‘స్వయం గణన’ (Self-Enumeration) సదుపాయం అందుబాటులో ఉన్నట్లు కాకినాడ నగర కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ తెలిపారు. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ మాట్లాడుతూ, ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు ప్రజలకు స్వయం గణన అందుబాటులో ఉంటుందని, ఈ విధానం ద్వారా సమర్పించిన వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో పక్కాగా ధృవీకరిస్తారని తెలిపారు. అలాగే se.census.gov.in వెబ్సైటు ద్వారా కూడా ఆన్ లైన్ లో స్వయం గణన చేసుకోవచ్చన్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జనగణన-2027’ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన నిర్వహించి, ప్రతి ఇంటి వివరాలు, గృహ పరిస్థితులపై సమాచారం సేకరిస్తారని పేర్కొన్నారు. రెండో దశలో జనాభా గణన చేపట్టడం జరుగుతుందని, దేశంలోనే తొలిసారిగా ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్యూమరేటర్లు తమ స్మార్ట్‌ఫోన్లలో ప్రత్యేక మొబైల్ యాప్‌లను ఉపయోగించి వివరాలను నమోదు చేస్తారన్నారు. మొదటి దశకు సంబంధించి నగరపాలక సంస్థ పరిధిలో అవసరమైన అన్ని ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈ నెల 15 నుండి రెండు దశలుగా శిక్షణ జరుగుతుందని తెలిపారు. నగరంలోని ఎన్యూమరేషన్ బ్లాకులకు అనుగుణంగా సిబ్బందిని నియమించామని తెలిపారు. శిక్షణలో ఫీల్డ్ లెవల్ డేటా సేకరణ, మొబైల్ యాప్ వినియోగం, పరిధుల గుర్తింపు మరియు డేటా భద్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే జన గణనపై ప్రజలకు అవగాహన కల్గించేందుకు వార్డ్ సచివాలయాల వారీగా కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. ఈ జణ గణన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నగర ప్రజలందరూ సహకరించాలని, ముఖ్యంగా స్వయం గణన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిసిపి కే వి కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.