కాకినాడ: రానున్న వేసవికాలంలో నగర ప్రజలకు త్రాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం సామర్లకోట వాటర్ స్టోరేజ్ ప్లాంట్ ను
ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా నగరపాలక సంస్థ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్.ఈ) పి. వెంకట్రావు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి రిజర్వాయర్లలో నీటి నిల్వ పరిస్థితులను కమిషనర్ సమీక్షించారు. సామర్లకోట రిజర్వాయర్‌లో నిల్వ చేసిన నీటిని శుద్ధి చేసి నగరంలోని పలు ఓవర్ హెడ్ ట్యాంకులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అలాగే అరట్లకట్ట రిజర్వాయర్‌లో కూడా నీటి నిల్వ కొనసాగుతున్నదని వివరించారు.
రిజర్వాయర్లలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. కాలువలను మూసివేసి రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసి, అవసరానికి అనుగుణంగా నగరంలోని వాటర్ ట్యాంకులను నింపే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్.ఈ పి. వెంకట్రావు మాట్లాడుతూ, వేసవిలో నీటి ఎద్దడి రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా త్రాగునీటి సమస్యలు తలెత్తితే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే చర్యలు కూడా సిద్ధంగా ఉన్నాయనిపేర్కొన్నారు.
నేడు జగన్నాథపురంలో త్రాగునీటి అంతరాయం
కాకినాడ : నగరంలోని జగన్నాథపురం ప్రాంతానికి త్రాగునీరు అందించే ప్రధాన పంపింగ్ లైన్‌లో లీకేజ్ ఏర్పడడంతో నీటి సరఫరా అంతరాయం కలిగింది. బాలాజీ చెరువు సమీపంలో ఈ లీకేజ్ గుర్తించిన నగరపాలక సంస్థ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులు మంగళవారం మరమ్మతు పనులను ప్రారంభించారు.
ఈ లీకేజ్ కారణంగా మంగళవారం జగన్నాథపురం ప్రాంత వాసులకు త్రాగునీటి సరఫరా నిలిపివేయాల్సి వచ్చింది. మరమ్మతు పనులు ఇంకా కొనసాగుతున్నందున బుధవారం కూడా నీటి సరఫరా సాధ్యంకాదని నగరపాలక సంస్థ సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. వెంకట్రావు తెలిపారు.
జగన్నాథపురం ప్రాంత ప్రజలకు తాత్కాలికంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
లీకేజ్ మరమ్మతు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి సాధారణ నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. వెంకట్రావు
తెలిపారు.