ప్రస్తుత వేసవి కాలంలో గుంటూరు నగర వ్యాప్తంగా త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులుచర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎక్కడా నీటి కొరత లేకుండా చూసేందుకు ఇప్పటికే రూ.2.7 కోట్ల అంచనాలతో ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’ రూపొందించినట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సమ్మర్ యాక్షన్ ప్లాన్ ని తక్షణమే క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, ఎక్కడైనా నీటి సమస్య తలెత్తితే సంబంధిత ఇంజినీరింగ్ అధికారులే వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నగరంలోని ప్రతి ప్రాంతానికి సమృద్ధిగా నీరు అందడమే ఈ యాక్షన్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఇప్పటికే నగరవ్యాప్తంగా 206 ప్రాంతాల్లో 823 పాయింట్స్ వద్ద పైపు లైన్లు డ్రైనేజీ కాలువల మీదుగా వెళ్తున్నట్లు గుర్తించారని, కలుషిత నీటి ముప్పు పొంచి ఉన్న డ్రైన్ క్రాస్ లైన్లను తక్షణమే తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రతి రోజు త్రాగునీటి సరఫరా సమయంలో ప్రతి ఎమినిటి కార్యదర్శి 10కి తగ్గకుండా నీటి శ్యాంపిల్స్ ల్లో క్లోరిన్ తగుమోతాదులో ఉండేలా పరిశీలించి, ప్రతి శ్యాంపిల్ రిపోర్ట్ ని ఏపీసిఎంఎం యాప్ లో అప్ లోడ్ చేయాలని, ఏఈలు, డిఈఈలు పర్యవేక్షించాలన్నారు. నూతనంగా పైపులైన్లు అవసరమైన ప్రాంతాల్లో వాటి ఏర్పాటు కోసం రూ.1 కోటి నిధులను సిద్ధంగా ఉంచామన్నారు. భూగర్భ జలాల వినియోగాన్ని సమర్థవంతంగా వాడుకోవడంలో భాగంగా, నూతన పవర్ బోర్ వెల్స్ ఏర్పాటుకు రూ.50 లక్షలు, ప్రస్తుతం ఉన్న బోర్ వెల్స్ మరమ్మతులకు రూ.40 లక్షలు కేటాయించడం జరిగిందని, అన్నింటినీ అందుబాటులోకి తీసుకురావాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. విలీన ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా, 6 ప్రత్యేక నీటి ట్యాంకర్లను నిరంతరం సిద్ధంగా ఉంచాలని, త్రాగునీటి సరఫరా జరగని ప్రాంతాలకు యుద్ధ ప్రాతిపదికన సరఫరా చేయాలని అధికారులకు స్పష్టం చేశామన్నారు. ప్రజల దాహార్తిని తీర్చే లక్ష్యంతో నగరంలోని రద్దీగా ఉండే 20 ప్రధాన కేంద్రాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలిగించేందుకు నగరంలోని రద్దీగా ఉండే నాలుగు ప్రధాన కూడళ్లలో సిగ్నల్ పడే చోట గ్రీన్ మ్యాట్ షెడ్లను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు.నగరంలోని ప్రతి రిజర్వాయర్ ని నిర్దేశిత కాలపరిధిలో శుభ్రం చేయాలన్నారు. వేసవి కాలం ముగిసే వరకు త్రాగునీటి సరఫరా విభాగం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఉండవల్లిలోని ప్రధాన పంపింగ్ కేంద్రం వద్ద అవసరమైతే అదనపు మోటార్లను ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉండాలని, పైపులైన్ల లీకేజీలు, కలుషిత నీటి సరఫరాపై ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు.