కాకినాడ , ఏప్రిల్ 11:
సచివాలయ కార్యదర్శులు తమ పరిధిలోని ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని ప్రతిరోజూ పర్యవేక్షించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఆదేశించారు.  తాడేపల్లి నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సచివాలయ కార్యదర్శులు ప్రతిరోజూ గృహాలను సందర్శించి త్రాగునీటి సరఫరా, వీధి దీపాల పనితీరు, చెత్త సేకరణ వంటి అంశాలను సమీక్షించాలని తెలిపారు. శానిటేషన్ కార్మికులు విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో పర్యవేక్షించడంతో పాటు, కాలువల శుభ్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ అంశాలపై సమగ్ర డేటాను సేకరించాలని ఆదేశించారు.

ప్రతి అధికారి తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సురేష్ కుమార్ హెచ్చరించారు. ప్రాంతాల్లో అమలవుతున్న మౌలిక సదుపాయాల పురోగతిని అర్బన్ లోకల్ బాడీలు (ULBs) స్పష్టంగా ప్రదర్శించాలని సీడీఎంఏ ఆదేశించారు.

అదేవిధంగా ఇంటి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని సూచిస్తూ, ఇంటి పన్ను, కొళాయి పన్ను, ఖాళీ స్థల పన్నులు ఇంకా చెల్లించని వారికి ఈ నెలాఖరు వరకు 5 శాతం రాయితీతో చెల్లించే అవకాశం ఉందని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కే శ్రీనివాస్, ఎస్‌ఈ పి. వెంకట్రావు, ఈఈ కనకారావు తదితర అధికారులు పాల్గొన్నారు.

About The Author