ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
*ఆ మహనీయుని అడుగుజాడల్లో అందరూ నడవాలి
*నగరపాలక సంస్థలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో కమీషనర్ జస్వంత్ రావు

అనంతపురం నగరపాలక సంస్థ: వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక ప్రయోజనాలే మిన్న అన్న భావనతో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పోరాడిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కమీషనర్ జస్వంత్ రావు పేర్కొన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నగరపాలక సంస్థలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

కుల నిర్మూలన కోసం పోరాడుతూ దేశాభివృద్ధికి చేసిన ఆయన కృషి అసాధారణమని తెలిపారు. విద్య ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమని నిరూపించిన మహానుభావుడు అని కొనియాడారు.

ప్రపంచ దేశాలు సైతం భారత రాజ్యాంగాన్ని గౌరవంతో చూస్తున్నాయంటే, అక్షరాన్ని ఆయుధంగా మలుచుకుని ఆయన రూపొందించిన రాజ్యాంగం దేశ నిర్మాణానికి ఎంతగానో దోహదపడిందని అన్నారు.

భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను భారత సమాజానికి పరిచయం చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ టీపీఓ ఓంకార్, మేప్మా సీపీఎం కాటమయ్య, టౌన్ ప్లానింగ్ సూపరింటెండెంట్ నాగరాజు, మేప్మా సిబ్బంది,వర్క్ ఇన్స్పెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు

About The Author