గుంటూరు నగరానికి కీలకమైన ప్రాజెక్ట్ లను రోజువారీ, నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకొని, అందుకు తగిన విధంగా వేగంగా చేపట్టడానికి సదరు శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్3, మిర్చి యార్డ్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం, గుంటూరు రూరల్ ప్రాంతాల్లో ఈఎల్ఎస్ఆర్ ల నిర్మాణం, శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం, బిఆర్ స్టేడియం మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణ అభివృద్ధి పనులపై ఆయా విభాగాలు, జిఎంసి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతం నగరంలో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లు గుంటూరు నగరానికి తలమానికంగా నిలుస్తాయని, అందుకు తగిన విధంగా నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనే, ప్రతి పనికి తగిన కాలపరిమితి విధించుకొని చేయాలన్నారు. శంకర్ విలాస్ వంతెన పనులు ఈ ఏడాది చివరికి పూర్తి అయ్యేలా కాంట్రాక్టర్ నిర్మాణ సామగ్రి, కార్మికులను సిద్దం చేసుకోవాలని స్పష్టం చేశారు. మే నెల చివరికి పిల్లర్ల నిర్మాణం పూర్తీ కావాలని, పనులు జరిగే సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలన్నారు. నిర్మాణ మార్కింగ్ ప్రాంతాన్ని క్లియర్ చేసి, త్వరలోనే ఆర్&బి కి నిర్మాణ పనులకు అప్పగించేలా పట్టణ ప్రణాళిక అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. పిల్లర్ల నిర్మాణ పనులతో పాటే నిర్దేశిత 21 శ్లాబ్ లను కూడా చేసుకోవాలన్నారు. వర్షాలు ఎక్కువగా కురిసే లోపే మెజార్టీ వర్క్ పూర్తీ కావాలన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్3 పనులు మందకొడిగా జరుగుతున్నాయని, జూలై చివరి పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరగాలని స్పష్టం చేశారు. కేవలం 2 కల్వర్ట్ ల నిర్మాణమే ప్రారంభించారని, మిగిలిన 8 తక్షణం ప్రారంభించేలా ప్రజారోగ్య ఇంజినీరింగ్ అధికారులు కాంట్రాక్టర్ తో మాట్లాడాలన్నారు. రోడ్ కి ఇరువైపులా ఉన్న డ్రైన్ నిర్మాణం కూడా ప్రారంభించాలని, ప్రతి పనిని 15 రోజులకు షెడ్యూల్ చేసుకోవాలన్నారు. మిర్చి యార్డ్ దగ్గర ఫ్లై ఓవర్ పనుల్లో వేగం ఉండేలా కాంట్రాక్టర్ చేపట్టాలని, సదరు ప్రాంతంలో నిర్మాణ పనులకు ఏ అడ్డంకులు లేవన్నారు. గుంటూరు రూరల్ ప్రాంతాలను మంజూరు అయిన ఈఎల్ఎస్ఆర్ ల నిర్మాణ పనులు మొదలు పెట్టడంతో పాటు అంకిరెడ్డిపాలెం, పెద్ద పలకలూరులలో ఈఎల్ఎస్ఆర్ నిర్మాణాలకు స్థల గుర్తింపు చేపట్టాలన్నారు. బిఆర్ స్టేడియం అభివృద్ధి పనులపై సమీక్షిస్తూ, పనుల వేగవంతంకు జిఎంసి నుండి పర్యవేక్షణకై ఈఈ, డిఈఈ, ఏఈలకు విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇస్తామన్నారు. 6 నెలల్లో పనులు పూర్తి అయ్యేలా డిఎస్డీఓ పనుల వేగవంతంకు శాప్, జిఎంసి అధికారులు, కాంట్రాక్టర్ తో సమన్వయం చేసుకోవాలన్నారు.
సమావేశాల్లో పబ్లిక్ హెల్త్ ఎస్ఈ డి.శ్రీనివాస్, జిఎంసి సిటి ప్లానర్ రాంబాబు, ఎస్ఈ వెంకటేశ్వరరావు, డిఎస్డీఓ అఫ్రోజ్ ఖాన్, ఆర్&బి ఈఈ విశ్వనాధరెడ్డి, డిఈఈ చిన్నయ్య, జిఎంసి ఈఈ విష్ణు, ఎన్హెచ్ఐ ఏఈ ఆయా ప్రాజెక్ట్స్ కాంట్రాక్టర్ ప్రతినిధులు పాల్గొన్నారు.