కాకినాడ : అన్నా క్యాంటీన్ల సమర్థవంతమైన నిర్వహణ, సేవల మెరుగుదలకు దోహదపడేలా స్థాయి సలహా సంఘం అవగాహన కార్యక్రమం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోని శుక్రవారం సమావేశం హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి అన్నా క్యాంటీన్, ఏపీ సీఈఓ పి. వంశీధర్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నా క్యాంటీన్లు పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించే ముఖ్యమైన సంక్షేమ పథకమని తెలిపారు. ఈ సేవలు మరింత సమర్థవంతంగా ప్రజలకు అందేలా సలహా సంఘం సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. క్యాంటీన్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత, సమయపాలన వంటి అంశాలపై నిరంతరం పర్యవేక్షణ అవసరమని చెప్పారు.

అలాగే, స్థానిక సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు సభ్యులు చురుకుగా పనిచేయాలని, క్యాంటీన్లపై ప్రజల విశ్వాసం మరింత పెంచే దిశగా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అన్నా క్యాంటీన్ల సేవలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో సలహా సంఘం సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు. క్యాంటీన్ల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ అవగాహన కార్యక్రమం ద్వారా అన్నా క్యాంటీన్ల పనితీరు మెరుగుపడటంతో పాటు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కే శ్రీనివాస్, ఈ ఈ కనకారావు, డి ఈ లక్ష్మీనారాయణ, సలహా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About The Author