గుంటూరు నగరంలో జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం చాలా సురక్షితంగా ఉంటుందని, ఎటువంటి అపోహలకు గురికావద్దని, జన గణనపై సందేహాలకు జిఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు పని చేసేలా కాల్ సెంటర్ 0863-2345105 ఏర్పాటు చేశామని గుంటూరు నగర ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి మరియు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 3 చార్జీల్లో (3 నియోజకవర్గాలు) ఈ నెల 1వ తేదీ నుండి జన గణనలో భాగంగా తొలి దశ ఇళ్ల గణన ప్రారంభమైందని, దీనికోసం 1272 మంది ఎన్యుమరేటర్లను, 201 సూపర్వైజర్లను, ముగ్గురు ఛార్జ్ అధికారులను నియమించామన్నారు. ఇళ్ల గణన మే 1వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు వారి ఐడీ కార్డులను పరిశీలించి వివరాలు తెలియజేయాలని సూచించారు. కొందరు అపోహలకు గురై ఎన్యుమరేటర్లకు తగిన సమాచారం ఇవ్వడం లేదని తమ దృష్టికి వచ్చిందని, ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం చాలా సురక్షితంగా ఉంటుందని, సరైన సమాచారం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన తదితర ప్రణాళికలు రూపొందించడానికి వీలవుతుందన్నారు. గృహ గణనలో 33 నిర్దిష్ట ప్రశ్నలు ఉంటాయని, ప్రధానంగా ఇంటి వివరాలు, ఎల్పీజీ, టాయ్ లెట్స్, విద్యుత్, ట్యాప్ కనెక్షన్ వంటి మౌలిక వసతులు, టీవీ, వాహనం, సెల్ ఫోన్, ఇంటర్ నెట్ వంటి గృహోపకరణాలు, ఫోన్ నంబర్ వంటి వివరాలు మాత్రమే అడుగుతారని, ఓటీపీ, ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, యుపిఐ పేమెంట్ అంశాలను, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎన్యుమరేటర్లు అడగరని స్పష్టం చేశారు. స్వీయ నమోదు చేసుకున్న వారు జనగణనకు వచ్చే సిబ్బందికి తమ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడిని తెలపాలని సూచించారు.