“శ్రామికుని చెమట వాసన, దాని విలువ తనకు తెలుసని, కార్మికుని హక్కుల పరిరక్షణకు న్యాయస్ధానాలు, న్యాయమూర్తులు, మండల న్యాయ సేవా సంస్ధ కట్టుబడి వున్నాయని, ప్రభుత్వం అందజేస్తున్న ఈ-శ్రమ్, ఇన్సూరెన్సు, పెన్షన్ వంటి పధకాలను అందరూ నమోదు చేసుకోవాలని, ఎటువంటి న్యాయపరమైన సమస్యలున్నా సంస్ధను సంప్రదించాలని, రాజ్యాంగపరంగా కార్మిక హక్కులు కల్పించబడ్డాయన్నా, ఓటు హక్కు వచ్చినా, నిర్బంధ విద్యా హక్కు వచ్చినా అది రాజ్యాంగ నిర్మాత Dr. B. R. అంబేద్కర్ కృషి ఫలితమేనని, కార్మికులు అమ్ముడుపోకుండా తమ సమస్యలను తీర్చగలిగే సరైన నాయకుని ఎన్నుకోవాలని, కార్మికులు తమ పిల్లలను చదివించి ప్రయోజకులను చేయాలని, చదువుకుంటే చరిత్రపై అవగాహన వస్తుందని, చరిత్ర తెలిసినవాడు క్రొత్త చరిత్రను లిఖిస్తారని అంబేద్కర్ అన్నారని” భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి మరియు మండల న్యాయ సేవా సంస్ధ చైర్మన్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి గౌరవ శ్రీ Dr. B. లక్ష్మీనారాయణ అన్నారు.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్బంగా శనివారం సంస్థ ఆధ్వర్యంలో భీమవరం మునిసిపల్ ఆఫీసులో పారిశుధ్ధ కార్మికులతో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహనా సదస్సులో జిల్లా న్యాయమూర్తి ముఖ్య అతిధిగా పాల్గొని పలు కార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు. కార్మికులకు ప్రభుత్వం అందజేస్తున్న పధకాల గురించి అసిస్టెంట్ లేబర్ కమీషనర్ A. శ్రీలక్ష్మి వివరించారు. భీమవరం మునిసిపల్ కార్మికులకు వర్తింపజేసిన పధకాల గురించి సమగ్ర నివేదికను అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అసిస్టెంట్ మునిసిపల్ కమీషనర్ A. రాంబాబు కార్మికుల సంక్షేమానికి మునిసిపాలిటి కట్టుబడి ఉందని, కార్మికులకు వారి అర్హత, సీనియారిటీలను బట్టి పదోన్నతులు ఉంటాయన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలేటి యోహాన్ మాట్లాడుతూ కార్మికులు ఆదాయానికి మించి అధిక వడ్డీకి అప్పులు చేయరాదని, అప్పుల భారంతో కుటుంబాలు నాశనమవుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) శ్రీ G. సురేష్ బాబు, 1వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) శ్రీమతి P. హనీష, 2వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ శ్రీమతి N. జ్యోతి, 1వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ M. నాగరాజు, ప్యానల్ న్యాయవాదులు అంబేద్కర్, వెంకటరమణ, సురేష్ కుమార్, ఉష, అమూల్య, పద్మ, మహిమా జ్యోతి, సునీత, సానిటరీ ఇన్స్పెక్టర్లు సత్యనారాయణరాజు, సూర్యనారాయణరాజు, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.