స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎలక్ట్రోల్ మ్యాపింగ్ 95 గుంటూరు తూర్పు, 94 పశ్చిమ నియోజకవర్గాల్లో 60 శాతంకి పైగా మ్యాపింగ్ జరిగిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఏఈఆర్ఓ, డిప్యూటీ కమిషనర్ సాంబశివరావు రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. శుక్రవారం జిఎంసి ప్రధాన కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్ చాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవల్ ఏజంట్లను నియమించుకొని వివరాలను తమకు అందించాలని కోరారు. స్పెషల్ ఇన్సేంటివ్ రివిజన్ పై జరిగే సర్వేని రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పరిశీలించి, సర్వే వేగవంతానికి సహకరించాలన్నారు. త్వరలో బిఎల్ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సంయుక్త సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అలాగే దేశ వ్యాప్తంగా ప్రభుత్వం జనగణన కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, ఈ కార్యక్రమంలో వారి వారి రాజకీయ పార్టీల ప్రతినిధులు మరుయు కార్యకర్తలు స్వీయ జనగణన చేసుకోవాలని తెలిపారు. రాజకీయ పార్టీల సమావేశాల్లో కూడా ఈ జనగణన గురించి కార్యకర్తలకు, ప్రజలకు తెలిపి వారి వివరాలను స్వీయ జనగణన చేసుకునే విధంగా అవగాహనా కలిగించాలని తెలియచేశారు.
సమావేశంలో ఎలక్షన్ డి.టి నాగమల్లెశ్వర రావు, ఓంకార్ (టి.డి.పి), త్రినాద్ (జనసేన), డి. సత్యనారాయణ (బిజెపి), డి.జాన్ బాబు (వైఎస్ఆర్సీపీ), సుదీర్ బాబు(కాంగ్రెస్), సిహెచ్.వాసు (బిఎస్పీ), తాతా సేవా కుమార్ (అమ్ ఆద్మీ పార్టి), ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.